చెన్నై : మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కుల వ్యవస్థ రద్దు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన మరోసారి సనాతన ధర్మం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కుల వ్యవస్థను రద్దు చేయడం అంటే ఎవరూ గుడికి వెళ్లకూడదని అర్థం కాదని అన్నారు. గుడిలో మాత్రమే కాకుండా సమాజంలో కూడా అందరికీ సమాన హక్కులు ఉండాలని అర్థమని తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో తాను చేసిన ‘సనాతన ధర్మ నిర్మూలన’ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ప్రజలను అగ్ర కులాలు , నిమ్న కులాలుగా విభజించే ఆ వ్యవస్థను రద్దు చేయడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.
నేను తమిళనాడు శాసనసభలో మాట్లాడినప్పుడు ప్రజలను విభజించే కుల వ్యవస్థ రద్దు కావాలని చెప్పాను. దీనిపై కొందరు నన్ను విమర్శిస్తున్నారు. నేను భయపడే వ్యక్తిని కాదన్నారు. ద్రవిడ ఉద్యమం వ్యతిరేకత నుండే ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఆ కోణంలో, నేను ఒక చిన్న వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను అని అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు అన్నారు . సమకాలీన సంఘటనల పాడ్‌కాస్ట్ ఆ కోణంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ప్రజలను అగ్ర కులాలు, నిమ్న కులాలుగా విభజించే వ్యవస్థను రద్దు చేయడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
పెరియార్, అంబేద్కర్, అన్నా, కళైంజర్ వంటి మహనీయులు ప్రవచించిన సూత్రాల గురించి కూడా నేను మాట్లాడాను అని చెప్పారు ఉదయనిధి స్టాలిన్. దేవుడిపై ఎవరికైనా ఉన్న నమ్మకానికి మేము వ్యతిరేకం కాదు. కానీ అసమానతలను, అణచివేతను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు.
