Justice Vikram Nath: ‘వీధికుక్కల కేసుతో నేనిప్పుడు వరల్డ్‌ ఫేమస్‌’ – జస్టిస్ విక్రమ్‌ నాథ్‌

‘వీధికుక్కల కేసుతో నేనిప్పుడు వరల్డ్‌ ఫేమస్‌’ - జస్టిస్ విక్రమ్‌ నాథ్‌

Justice Vikram Nath : దిల్లీ, ఎన్సీఆర్‌లలోని అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును త్రిసభ్య ధర్మాసనం సవరించిన సంగతి తెలిసిందే. ఈ కేసు తనను ఫేమస్ చేసిందని సుప్రీంకోర్టు (Supreme Court) సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్‌ (Justice Vikram Nath) పేర్కొన్నారు. కేరళ తిరువనంతపురంలో నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ (NALSA) నిర్వహించిన మానవ- వన్యప్రాణుల అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వీధి కుక్కల కేసు తనకు అప్పగించినందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ కి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న చిన్న పనుల కారణంగా తనకు పౌర సమాజంలో మంచిపేరుందన్నారు. ఈ వీధి కుక్కల కేసు నేపథ్యంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకు గుర్తింపు వచ్చిందన్నారు. సుప్రీం తీర్పును సవరించడంతో జంతు ప్రేమికులతో పాటు శునకాల నుంచి కూడా తనకు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందుతున్నట్లు సందేశాలు వచ్చాయన్నారు.

Justice Vikram Nath Key Comments

వీధి కుక్కల దాడులు, రేబిస్‌ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో వీధి కుక్కల దాడుల వల్ల దిల్లీ, ఎన్సీఆర్‌ పరిధిలో రేబిస్‌ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అదే సమయంలో శునకాల తరలింపును గనుక అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించిది కూడా. ఈ నేపథ్యంలో ఈ తీర్పు సమంజసం కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు(వీళ్లలో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు) సోషల్‌ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పునఃపరిశీలిస్తానని హామీ ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌.. ఈ పిటిషన్‌ను ముగ్గురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది. ఈ సందర్భంగా రేబిస్‌ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌ చేసిన తర్వాత వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 11న ఇచ్చిన తీర్పును సవరించింది.

Also Read : MP Mahua Moitra: అమిత్‌ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీపై కేసు నమోదు

Leave A Reply

Your Email Id will not be published!