Bihar Assembly Elections: బిహార్‌లో మోగిన ఎన్నికల నగారా
బిహార్‌లో మోగిన ఎన్నికల నగారా
Bihar : దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆ రాష్ట్రంలో నవంబరు 6, 11 తేదీల్లో రెండు విడతల పోలింగ్ జరగనుంది. అదే నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. దీంతోపాటు తెలంగాణలోని జూబ్లీహిల్స్‌సహా దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబరు 11వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. వాటి ఓట్ల లెక్కింపూ 14నే జరగనుంది. సోమవారం దిల్లీలో మీడియా సమావేశంలో బిహార్ ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు.
‘బిహార్ (Bihar) ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తాం. నవంబరు 6, 11 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. కౌంటింగ్‌ను 14వ తేదీన చేపడతాం. 16వ తేదీకల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తాం’ అని సీఈసీ వివరించారు. బిహార్ ఎన్నికలకు ‘మదర్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్’గా సీఈసీ అభివర్ణించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే పోలింగ్‌కు సంబంధించిన వీడియోలను హైకోర్టులకే షేర్ చేస్తామని, పార్టీలకు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబరు 22వ తేదీతో ముగియనుంది. మొత్తం 243 నియోజకవర్గాల్లో రెండు ఎస్టీలకు, 38 ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. మిగిలినవి జనరల్ కోటాలో ఉన్నాయి.బిహార్ ఎన్నికల షెడ్యూలును ప్రకటించడంతో ఎన్నికల కోడ్ సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. ఓటేసేందుకు సంప్రదాయ గూంఘట్ (ముసుగు), బుర్ఖాలతో వచ్చిన మహిళల గుర్తింపును పోలింగ్ కేంద్రాలవద్ద అంగన్‌వాడీ కార్యకర్తలతో చేపడతామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.
Bihar – 17 కొత్త విధానాల అమలు
బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో 17 కొత్త విధానాలను అమలు చేయనున్నామని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. వీటిని ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఈ రాష్ట్రంలో చేపట్టిన ఓట్ల శుద్ధీకరణ భవిష్యత్తులో దేశానికి మార్గదర్శకంగా నిలవనుందని వివరించారు.
Bihar – ముఖ్యమైన ఆంశాలివే
అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మొబైల్ ఫోన్ల డిపాజిట్ సౌకర్యం. ఓటర్ల రద్దీ నివారణకు వీలుగా 1,200 మందికి ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఏర్పాటు. ఓటర్ల సమాచార స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రం సీరియల్, పార్టు నంబర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రణ. ఈసీఐనెట్ డిజిటల్ వేదిక ద్వారా పోలింగ్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు. ప్రతి 2 గంటలకోసారి ప్రిసైడింగ్ అధికారులు.. పోలింగ్ శాతాలను అప్‌లోడ్ చేసే ఏర్పాట్లు.
100 శాతం పోలింగ్ కేంద్రాల వెబ్‌కాస్టింగ్. అభ్యర్థుల తరఫున స్లిప్పులు పంచేవారు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల ఆవలే ఉండేలా ఏర్పాట్లు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటోల ఏర్పాటు.
ఫారం 17సీ, ఈవీఎం డేటా మధ్య తేడా కనిపించినా, మాక్ పోల్ డేటా ఈవీఎంల నుంచి చెరిగిపోకపోయినా వీవీప్యాట్లన్నీ లెక్కించాలి.
ఎన్నికల సంబంధిత డేటా అందరికీ అందుబాటులో ఉండేలా నియోజకవర్గ స్థాయిలో సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు. ఇందులో డిజిటల్ ఇండెక్స్ కార్డులు, రిపోర్టులు ఉంటాయి. పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణ.
పోలింగ్‌లో పాల్గొనే సిబ్బంది అందరికీ ఎన్నికల భత్యం. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలకు గౌరవ భత్యం.
వచ్చే నెల 11న ఉప ఎన్నికలు
తెలంగాణలోని జూబ్లీహిల్స్, జమ్మూ కశ్మీర్‌లోని బడ్గాం, నగ్రోటా, రాజస్థాన్‌లోని ఆంటా, మిజోరంలోని డంపా, ఒడిశాలోని నువాపడా, ఝార్ఖండ్‌లోని ఘట్‌సిలా, పంజాబ్‌లోని తరణ్ తరణ్ సీట్లకు నవంబరు 11వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల కౌంటింగ్ 14వ తేదీన జరగనుందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు.
Also Read : Prashant Kishor: బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
