రూ. 1 ల‌క్ష కోట్ల‌తో ఉద్యాన హ‌బ్ గా రాయ‌ల‌సీమ‌

తయారు చేస్తామ‌న్న సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రూ. 1 లక్ష కోట్ల‌తో రాయ‌ల‌సీమ‌ను ఉద్యాన హ‌బ్ గా మారుస్తామ‌ని అన్నారు. శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు. రూ.30 వేల కోట్ల మేర ప్రభుత్వ నిధులు, రూ.70 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులతో సీమలో హర్టీకల్చర్ అభివృద్ధి చేస్తామ‌న్నారు. ప్రస్తుతం ఏడాదికి 400 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఫలాల ఉత్పత్తి జరుగుతోంద‌న్నారు. భవిష్యత్తులో 1000 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులకు కేంద్ర స్థానంగా రాయలసీమ ఎదుగుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అక్వా కల్చర్ గత పాలనలో ఒడిదుడుకులు ఎదుర్కొంద‌న్నారు. రూ.1.50 యూనిట్ చొప్పున విద్యుత్ ను ఆక్వాకు ఇస్తున్నామ‌న్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆక్వాకల్చర్ హబ్ గా మన ప్రాంతం తయారవుతుందన్నారు. ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో డబ్బులు చెల్లించింది కూడా కూటమి ప్రభుత్వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

కోకోనట్, కోకో, కాఫీ లాంటి పంటలపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. దీనిపై మరింత శ్రద్ధపెట్టి వ్యాల్యూ అడిషన్ చేసేలా చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలను నివారించేలా చర్యలు చేపడుతున్నామ‌ని చెప్పారు. ప్రతీ ఘటననూ ఆడిట్ చేయిస్తాం అని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు. విద్యార్ధులు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలని అన్నారు.
ఆత్మహత్యలు దేనికీ పరిష్కారం కాదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాన‌ని చెప్పారు. లాజిస్టిక్స్ రంగంలో పెనుమార్పులు సాధించేలా నిర్ణయం తీసుకుంటున్నామ‌న్నారు. రైల్వే రంగంలో రూ.3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!