కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హాట్ ఫెవరేట్ గా ఉన్న సఫారీలకు కోలుకోలేని షాక్ తగిలింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ అనూహ్యంగా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. బలమైన ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించింది. దర్జాగా ఫైనల్ కు చేరుకుంది. టోర్నీలో గ్రూప్ , సూపర్ -8లో అజేయమైన ట్రాక్ రికార్డ్ ను కలిగినా చివరకు కీవీస్ బౌలర్ల దెబ్బకు తల వంచింది దక్షిణాఫ్రికా. కప్ ఎగరేసుకు పోవాలని అనుకున్న ఆ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. మరో వైపు పడుతూ లేస్తూ టోర్నీలో సెమీస్ దాకా వచ్చిన కీవీస్ జట్టు సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆల్ రౌండ్ షోతో టోర్నీలో ఫైనల్ కు చేరుకుంది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది దక్షిణాఫ్రికా. ఆ జట్టును కీవీస్ బౌలర్లు నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులకే కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యింది. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టుకు చెందిన ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 33 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఇందులో 10 ఫోర్లు 8 సిక్సులు ఉన్నాయి. తను సెంచరీ తో నాటౌట్ గా ఉన్నాడు. జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఫైనల్ కు తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు అలెన్. తనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇవాళ రెండో సెమీ ఫైనల్ ముంబై వేదికగా జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా ఇంగ్లండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారితో కీవీస్ ఫైనల్ ఆడనుంది.
