ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ సీట్లు భారీగా పెర‌గొచ్చు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఏపీ బీజేపీ చీఫ్ మాధ‌వ్

అమ‌రావ‌తి : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు 50 శాతం మేర పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన వివరణపై స్పందించారు. షా తన తమిళనాడు పర్యటన సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన దామాషా పద్ధతిలో జరుగుతుందని చెప్పార‌న్నారు. అంటే పార్లమెంటులో ఏ రాష్ట్ర వాటా కూడా తగ్గదని స్పష్టం చేశారన్నారు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఒక క్రమబద్ధమైన, నిష్పక్షపాతమైన పద్ధతిలో జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు.

పార్లమెంటులో ఏ రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గించ బడదని బీజేపీ చీఫ్ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించ వ‌ద్ద‌ని కోరారు. ప్రతిపక్షాల ఆందోళనలను ఆయన తప్పుడు సమాచారంగా అభివర్ణించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల సంఖ్య 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ చర్య ప్రస్తుత కేటాయింపులను ప్రభావితం చేయకుండా విస్తృత ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఒక నిర్దిష్ట ప్రక్రియ ఉందన్నారు. ఆ విష‌యం తెలుసుకోకుండా ఎలా ప‌డితే అలా మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ వ‌ల్ల ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌ద‌ని స్ప‌ష్టం చేశారు పీవీఎన్ మాధ‌వ్.

Leave A Reply

Your Email Id will not be published!