న్యూఢిల్లీ : ఈ మధ్యన సినీ రంగానికి చెందిన ప్రముఖులు, నటీ నటులు తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ కోర్టులను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. తాజాగా ఈ జాబితాలోకి చేరి పోయాడు నేషనల్ ఐకానిక్ స్టార్ హీరో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన టాప్ హీరో అల్లు అర్జున్. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక దావా దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ తుషార్ రావు గెడెల ఈనెల 17న శుక్రవారం విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా పిటిషన్ లో తన పర్మిషన్ లేకుండా ఎలా పడితే అలా ఫోటోలు, వీడియోలు , గొంతును వాడుకుంటున్నారని ఆరోపించారు.
ప్రత్యేకించి తన సమ్మతి లేకుండా తన పేరు, చిత్రాలు, గొంతు వంటి వ్యక్తిత్వ లక్షణాలను ఉపయోగించడాన్ని నిరసిస్తూ నటుడు అల్లు అర్జున్ ఉపశమనం కలిగించేలా తీర్పు ఇవ్వాలని కోరారు. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన వ్యక్తిత్వ హక్కులను వస్తువులపై వాణిజ్య పరంగా ఉపయోగించడాన్ని నిరసిస్తూ కూడా పిటిషన్ దాఖలు చేయడం విశేషం. కాగా అల్లు అర్జున్ కంటే ముందు హైకోర్టును ఆశ్రయించిన వారిలో చాలా మంది నటులు ఉన్నారు.
మలయాళ నటుడు మోహన్‌లాల్, ఆధ్యాత్మిక ప్రబోధకుడు అనిరుద్ధాచార్య, గాయకుడు జుబిన్ నౌటియాల్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, నటులు కాజోల్ దేవగన్, ఆర్. మాధవన్, ఎన్టీఆర్ జూనియర్ల వ్యక్తిత్వ హక్కులను కోర్టు పరిరక్షిస్తోందని గమనించాలి. నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి దావానే దాఖలు చేశారు. ఆ తర్వాత బన్నీ కూడా చేరి పోయాడు ఈ జాబితాలోకి.
