ఫ్రెండ్లీ పోలీసింగ్ మా విధానం : డీజీపీ

స‌మ‌ర్థ‌వంతంగా సేవ‌లు అందించాలి

చిత్తూరు జిల్లా : ఏపీ డీజీపీ హ‌రీష్ కుమార్ గుప్తా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా స‌మీక్ష చేప‌ట్టారు. పోలీసుల‌కు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమ‌లు చేస్తున్నామ‌న్నారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించాలని అన్నారు. శాంతి భద్రతల విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మధుసూదన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి జిల్లాలో అమలవుతున్న పరిపాలనా చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రజా సేవల మెరుగుదలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు , ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సమీక్ష సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జరుగుతున్న పర్యవేక్షణ, సీసీ కెమెరాల వినియోగం, పటిష్ట నైట్ బీట్ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై డీజీపీ క్షుణ్ణంగా సమీక్షించారు. ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పలు సూచనలు చేశారు. జిల్లాలో డ్రోన్ సాంకేతికతను నేర నియంత్రణ, జనసమ్మర్థ నిర్వహణ, ప్రత్యేక ఆపరేషన్లలో సమర్థవంతంగా వినియోగిస్తున్న విధానాన్ని వివరించారు ఎస్పీ. అదేవిధంగా ప్రతి సబ్ డివిజన్ పరిధిలో నిరంతర డ్రగ్స్, గంజాయి నిరోధక తనిఖీలు, డ్రగ్ టెస్టింగ్, అవగాహన కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న చర్యలను వివరించారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ శక్తి టీమ్ ద్వారా తక్షణ స్పందన, అవగాహన కార్యక్రమాలు, భద్రతా చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు.

అదేవిధంగా జిల్లా పోలీస్ శాఖ అమలు చేస్తున్న “ధైర్య స్పర్శ – భయానికి ముగింపు, భద్రతకు ఆరంభం” కార్యక్రమం ద్వారా క్రైమ్ హాట్‌స్పాట్‌లలో ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందిస్తున్నట్లు, “జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు” కార్యక్రమం కింద QR కోడ్ ఆధారిత ఆటోరిక్షా భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమం ద్వారా మహిళల భద్రత, చిన్నారుల రక్షణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ మరియు రోడ్డు భద్రతపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీజీపీకి వివరించారు.

జిల్లాలో అమలవుతున్న డ్రోన్ ఆధారిత ఆధునిక పోలీసింగ్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ, సైబర్ , సోషల్ మీడియా మానిటరింగ్ వ్యవస్థ, మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యలు, మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు “ధైర్య స్పర్శ”, “జన విశ్వాస్”, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” వంటి వినూత్న ప్రజాకేంద్రిత కార్యక్రమాలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. ఈ కార్యక్రమాలు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆధునిక, సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌కు చిత్తూరు జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.

Leave A Reply

Your Email Id will not be published!