స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీ మలయప్ప స్వామి

వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేకం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామి వారు బంగారు కవచంలో పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీమలయప్ప స్వామివారికి, దేవేరులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంత్రం సహస్రదీపాలంకార సేవలో స్వామి, అమ్మవార్లు బంగారు కవచంలో దర్శనమిచ్చారు. ఆ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు సదాశివరావు, జానకి దేవి , సుచిత్ర ఎల్లా, ఆల‌య డెప్యూటీ ఈవో లోకాన‌థం త‌దిత‌రులు పాల్గొన్నారు.

జ్యేష్టాభిషేకం సంద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండ‌గా సెల‌వులు ముగిసినా ఇంకా భ‌క్తుల ర‌ద్దీ త‌గ్గ‌నే లేదు. రోజు రోజుకు భ‌క్త బాంధ‌వులు తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!