అమరావతి : మత్స్యకారుల అభివృద్దికి తమ సర్కార్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని మంత్రులు వంగలపూడి అనిత, పి. జనార్దన్ రెడ్డి అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో మత్స్యకారుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందన్నారు. నక్కపల్లి మండలం బోయపాడు వద్ద దొండవాక, రాజయ్యపేట (చందనాడ) తీరాల్లో నిర్మించనున్న రెండు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పెట్టుబడులు , మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఒక్కో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను రూ.24.77 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనుండగా, ఈ రెండు కేంద్రాల ద్వారా స్థానిక మత్స్యకారులకు ఆధునిక మౌలిక వసతులు, సురక్షిత బోటు ల్యాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులు మంత్రి వంగలపూడి అనితకు కృతజ్ఞతలు తెలిపారు. హోంమంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో రూ.60 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో మంజూరైన మూడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో రెండింటిని పాయకరావుపేట నియోజకవర్గానికి తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు. మత్స్యకారులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, గతంలో మత్స్యకార గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఆమె, గత రెండేళ్లలో సుమారు రూ.600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ.100 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. రాజయ్యపేటలో గతంలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఎవరి మీదా కేసులు నమోదు చేయవద్దని తానే ఆదేశించినట్లు వెల్లడించారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, అనంతరం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యమని స్పష్టం చేశారు.
