ఆంధ్రా ఉత్ప‌త్తులు గ్లోబల్ బ్రాండ్లుగా మారాలి

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

నూజివీడు : మన రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడించే ప్రక్రియను చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పిలుపునిచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరిగి రైతులకు ప్రయోజనం కలిగి సంపద సృష్టికి ఆస్కారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని సీఎం స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు వద్ద గార్మె పాప్ కార్నికా నాన్ జీఎంఓ హైబ్రీడ్ మెయిజ్ విత్తనాలను ఆవిష్కరించారు. గార్మె పాప్ కార్నికా సంస్థ ఏర్పాటు చేసి దేశంలోనే అతిపెద్ద జన్యుమార్పిడి కాని ఎక్ప్ పాండబుల్ పాప్ కార్న్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఉపరాష్ట్రపతితో కలిసి ఆయన సందర్శించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఏలూరు జిల్లాకు వచ్చి రైతులు పండిస్తున్న జన్యు మార్పిడి జరగని మొక్క జొన్న విత్తనాలను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. గార్మె పాప్ కార్న్ సంస్థ భారత నేలపైనే దేశీయంగా జన్యుమార్పిడి జరగని విత్తనాలను రైతులతో కలిసి ఉత్పత్తి చేస్తోంద‌న్నారు సీఎం. మన నూజివీడు గడ్డ నుంచే పండే పాప్ కార్న్ మొక్క జొన్న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుందన్నారు. గార్మె పాప్ కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించిందని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సంస్థ ప్రతినిధుల్ని అభినందిస్తున్నాను.

17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో ఈ నాన్ జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్న ఉత్పత్తి చేస్తున్నారు. నూజివీడు సమీపంలోని ముసునూరు వద్ద దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయటం సంతోషదాయకం. దేశ వ్యాప్తంగా పాప్ కార్న్ ఉత్పత్తిలో 70 శాతం వాటాను కలిగి ఉన్న గార్మె సంస్థకు అభినందనలు. యాంత్రీకరణ, విత్తనాలు, సాగులో సాంకేతికత, రైతుల నుంచి మొక్క జొన్న కొనుగోలు ఇలా అన్నీ వ్యవస్థీకృతంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ మనం కొనుగోలు చేసిన పాప్ కార్న్‌పై పెద్ద ఎత్తున బ్రెజిల్ సహా ఇతర దేశాలకు వెళ్లింది. ఇక నుంచి మన దేశంలోనే ఈ సంపద ఉంటుంది. ఒక్క ఆసియానే కాదు గ్లోబల్ మార్కెట్ కు కూడా మన పాప్ కార్న్ ఎగుమతి కావాలి. ఆంధ్రా పాప్ కార్న్, అరకు కాఫీ తాగేలా రైల్వే స్టేషన్లలోనూ కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతాం. కొండవీటి కొయ్య బొమ్మలు లాంటి స్వదేశీ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు వెళ్లాలి. కేంద్రం, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని ఆర్ధిక శక్తిగా, రైతుల్ని ఎంట్రప్రెన్యూర్లుగా చూస్తున్నాం. రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు విలువ జోడించి ఎగుమతి చేయాలన్నదే మా లక్ష్యం. పసుపు, మిరప, మొక్క జొన్న, ఆక్వా తదితర ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరాలి.

Leave A Reply

Your Email Id will not be published!