హైదరాబాద్ : గత ఎన్నికల సందర్బంగా 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భర్తీ విషయం పట్ల నోరు ఎందుకు మెదపడం లేదంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. సోమవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఓవైపు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి హామీలు ఇచ్చిన సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి షరా మామూలేనని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆగమేఘాల మీద 121 మద్యం బ్రాండ్స్ కు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిందని, కానీ ఇదే క్రమంలో ఎందుకని జాబ్స్ నోటిఫికేషన్స్ ఇవ్వలేదని నిలదీశారు. సీఎం తన ప్రచారం కోసం పాకులాడటం, తమపై నోరు పారేసు కోవడం తప్పా ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదన్నారు. ఓవైపు నిరుద్యోగులు నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షలాది మంది నిరుద్యోగ యువత అవకాశాల కోసం ఎదురు చూస్తుండగా, మద్యం సంబంధిత నోటిఫికేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మద్యం సంబంధిత నోటిఫికేషన్లపై వేగంగా కదులుతోందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ ప్రకటనలకు తొందర లేనప్పుడు మద్యం వ్యాపారానికి ఎందుకంత ఆత్రుత పడుతున్నారంటూ మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు. విద్యావంతులైన యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం ఆదాయాన్ని పెంచుకోవడానికి అందుకు బదులుగా మద్యం దుకాణాలను, బ్రాండ్‌లను విస్తరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు.
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన వాగ్దానాన్ని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజీవ్ యువ వికాసం పథకాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోయాయని మండిపడ్డారు.
