నేపాల్ : నిరసనలు, ఆందోళనలు చెలరేగిన తరుణంలో నేపాల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ తరుణంలో దేశ ప్రధానమంత్రిగా అతి పిన్న వయసు కలిగిన బాలేంద్ర షా బాలెన్ కొలువు తీరారు. ఆయన వయసు కేవలం 35 ఏళ్లు మాత్రమే. ఆయనపై జనం నమ్మకం పెట్టుకున్నారు. పట్టం కట్టారు. తనపై బోలెడు ఆశలు లేక పోలేదు. తను వృత్తి పరంగా ర్యాపర్. ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు. కానీ ప్రవృత్తి పరంగా గాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తాడు బాలేంద్ర షా బాలెన్. మధేష్ ప్రాంతం నుండి మొదటి ప్రధానమంత్రి కూడా అయ్యారు. తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలేంద్ర షా 15 నుండి 18 మంది మంత్రులతో కూడిన ఒక చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
శుక్రవారం బాలేంద్ర షా బాలెన్ నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ హిమాలయ దేశంలో అత్యున్నత కార్యనిర్వాహక పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడైన ఎన్నికైన నాయకుడిగా నిలిచారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడైన బాలెన్‌ను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (1) ప్రకారం రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ ప్రధానమంత్రిగా నియమించారని రాష్ట్రపతి కార్యాలయం జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 12.34 గంటలకు రాష్ట్రపతి కార్యాలయం శీతల్ నివాస్‌లో కొత్తగా నియమితులైన ప్రధానమంత్రితో ప్రమాణం చేయించారు. హింసాత్మక ‘Gen Z’ నిరసనల తర్వాత జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికలలో, నేపాల్ ప్రజలు సంప్రదాయ రాజకీయ పార్టీలను చిత్తుగా ఓడించారు బాలెన్ కు పట్టం కట్టారు.
