త్వ‌రలో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ బాస్ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు, సంతోష్ రావుల అరెస్ట్ త‌ప్ప‌ద‌ని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ద‌ర్యాప్తు సంస్థ త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌న్నారు. ఈరోజు అసెంబ్లీ అనంతరం మీడియా చిట్ చాట్ లో కీలకమైన కామెంట్స్ చేశారు సీఎం.

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఇప్ప‌టికే విచార‌ణకు సంబంధించి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కీల‌క‌మైన అంశాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు సీఎం. కేవలం పంజాగుట్ట పీఎస్ లో నమోదైన ప్రైవేట్ కేసులో మాత్రమే క్లీన్ చిట్ వచ్చిందని అన్నారు. దీనికే మిడిసిప‌డితే ఎలా అని ప్ర‌శ్నించారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఓ ఏటీఎం లాగా వాడుకుంద‌ని ఆరోపించారు. లెక్క‌కు మించిన ఆస్తులు ఎలా వ‌చ్చాయో, ఏం ప‌ని చేస్తే వ‌చ్చిందో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం.

ఇదే ఫోన్ ట్యాప్ కు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం మొత్తం కేసులో క్లీన్ చిట్ ఇచ్చిందంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిప‌డ్డారు. ఒక పద్ధతి ప్రకారం ఫోన్ ట్యాపింగ్ విచారణ జరిగింద‌ని, దానిపై త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. బీ ఆర్ ఎస్ హయంలో ఆరువేల ఫోన్లు ట్యాప్ చేశారనీ…చేసిన తప్పుకు శిక్ష తప్పదని సీఎం అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!