అమరావతి : అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇంకా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతున్నాయి. చాలా చోట్ల నేల రాలాయి. దీంతో జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ సీఎం సమీక్ష చేపట్టారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలపై ఆరా తీశారు. వర్షాల కారణంగా 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని సీఎంకు వివరించారు ఉన్నతాధికారులు.
వీటి విలువ రూ.40 కోట్లుగా ఉంటుందని తేల్చారు. మరో వైపు 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినట్టు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇదిలా ఉండగా ఎల్పీజీ సరఫరా పైనా సీఎం సమీక్షించారు. భవిష్యత్‌లో సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని అన్నారు. ఫెర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు సీఎం. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
