తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ద‌ర్శ‌నం

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా శ్రీవారి దర్శనానికి సీఎం చంద్రబాబు కుటుంబం ద‌ర్శించు కోవ‌డం విశేషం. ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళినా వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుంచే దర్శనానికి వెళుతున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి సీఎం కుటుంబం ప్ర‌తి ఏటా రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, సతీమణి నారా బ్రాహ్మణి, దేవాన్ష్ ఉన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ కు వెళ్లారు. అక్క‌డ శ్రీ‌వారి భ‌క్తుల‌కు అప్యాయంగా అన్న ప్రసాద వితరణ చేశారు సీఎం చంద్ర‌బాబు, కుటుంబం. ఒక్కరోజు అన్న దానానికి వ్యయం అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని ఇప్పటికే అందించింది సీఎం కుటుంబం. ప్ర‌తి ఏటా వెంగ‌మాంబ అన్న ప్ర‌సాదానికి భూరి విరాళం అంద‌చేస్తూ వ‌స్తున్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదిలా ఉండ‌గా ఇప్పటికీ 12 మార్లు అన్నదానానికి ఎస్వీ అన్నదాన ట్రస్ట్ కు విరాళం ఇచ్చారు.

సీఎం , కుటుంబం రాక సంద‌ర్బంగా తిరుమ‌లలో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. అంత‌కు ముందు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, ఏఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈఓలు వి. వీర‌బ్ర‌హ్మం, డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ తో పాటు పూజారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.

Leave A Reply

Your Email Id will not be published!