అమరావతి : బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందన శూన్యమని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ధర్మదీక్షా స్థలిలో మీడియాతో మాట్లాడారు. బీసీల హక్కుల సాధన కోసం ధర్మ దీక్షకు పూనుకున్నానని అన్నారు. నేను అడుగుతున్న ఐదు డిమాండ్లలో నాలుగు, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలేనని పేర్కొన్నారు. బీసీ రక్షణ చట్టం, జనాభా గణన, 44% రిజర్వేషన్లు ఇవన్నీ టీడీపీ ఆవిర్భావం నుంచి ఇస్తున్న హామీలేనని తెలిపారు. బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే చంద్రబాబు, ఇప్పుడు వారి వెన్నెముక విరిచే కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు కుటుంబానికో, ఆయన పుత్రరత్నం నారా లోకేష్ బినామీలకో చెందింది కాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరి ఆస్తి అని ప్రకటించారు. లక్ష ఎకరాల రాజధానిలో ప్రభుత్వ అవసరాలు పోగా, ప్రైవేట్ కంపెనీలకు ఏ ప్రాతిపదికన భూములు ఇస్తున్నారో, అదే ప్రాతిపదికన బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ భూమికి మీరు నిర్ణయించిన ధర చెల్లించడానికి నేను, బీసీవై పార్టీ సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు. టీడీపీ అనుకూల మీడియాలో అమరావతిలో ఫామ్ హౌస్‌లు కట్టుకోవడానికి 7,000 మంది ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారని కథనాలు వస్తున్నాయన్నారు. నిజంగా అమరావతి ప్రజా రాజధానా? లేక ఫామ్ హౌస్‌లు, రేవ్ పార్టీల కోసమా? దీనిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
