అమెరికా : ఒంటెద్దు పోకడ పోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 50 రాష్ట్రాల్లో 3 వేల చోట్ల నో కింగ్స్ నిరసనలు మిన్నంటాయి. 90 లక్షల మందికి పైగా రోడ్లపైకి వచ్చారు జనం.. లాభాల కోసం యుద్ధమా అంటూ నినాదాలు చేశారు. అమెరికా సైనికులు అమ్మకానికి లేరంటూ స్లొగన్స్ కనిపించాయి. అన్యాయం చట్టమైనపుడు ప్రతిఘటనే కర్తవ్యం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.
గత 14 నెలల్లో, ట్రంప్ అమెరికాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ద్వేషించే, చూసి భయపడే, జాలిపడే, ఎగతాళి చేసే, అసహ్యించుకునే, నమ్మకం కోల్పోయే , తమకు ఏమాత్రం సంబంధం వద్దు అనుకునే ఒక దేశంగా మార్చేశాడని ఆరోపించారు. పూర్తిగా మూర్ఖుడైన, క్రూరుడైన, అవినీతిపరుడైన, చట్టాలను లెక్కచేయని, నిజాయితీలేని ఒక పిచ్చివాడిని మీరు వైట్‌హౌస్‌లో కూర్చోబెడితే, బహుశా ఇలాగే జరుగుతుందేమో అని మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు జో వాల్ష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ ధోరణి, ఇతర క్రూరమైన, చట్టాన్ని కాలరాసే పాలనగా తాము భావిస్తున్న దానిపై లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలోపు అమెరికన్లు వీధుల్లోకి రావడం ఇది మూడవసారి కావడం విశేషం.
మొత్తం 50 రాష్ట్రాలలో 3200కు పైగా కార్యక్రమాలు ప్రణాళిక చేశారు. అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కు చర్యలకు కేంద్ర బిందువైన మిన్నెసోటాలోని సెయింట్ పాల్లో, రాష్ట్ర రాజధాని భవనం వెలుపల ఒక భారీ ర్యాలీ జరిగింది. ఈ ఏడాది మిన్నియాపాలిస్లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్చి చంపిన రెనీ గూడ్, అలెక్స్ ప్రెట్టీల ఫోటోలు ఉన్న పోస్టర్లను అక్కడి జన సమూహంలోని చాలా మంది పైకెత్తి పట్టుకున్నారు.
