అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న డీఎంకే

త‌మిళ‌నాడు స‌ర్కార్ పై టీవీకే విజ‌య్ సంచ‌ల‌న లేఖ

చెన్నై : టీవీకే విజ‌య్ సంచ‌ల‌న లేఖ విడుద‌ల చేశారు . చెన్నై లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న ఈ లేఖ ద్వారా త‌మిళ‌నాడు డీఎంకే స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ నాటకంపై తలపతి విజయ్ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఎన్నికల సమయంలో ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలు కొత్తేమీ కాదని, కానీ అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత అని ఆయ‌న ఓట‌ర్ల‌కు హెచ్చ‌రించారు.

ఎన్నికల సంఘం పాత్ర ఉన్నప్పటికీ, అధికార డీఎంకే ప్రభుత్వం తమ అదుపులో ఉన్న కొందరు అధికారులను దుర్వినియోగం చేస్తూ, కేవలం మాకే కాకుండా మా అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలకు కూడా ఒత్తిడి, ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారంటూ ఆరోపించారు విజ‌య్. డీఎంకే తన మామూలు ఎత్తుగడలను కొనసాగిస్తూ, చివరి నిమిషం వరకు అనుమతి పత్రాలను ఆలస్యం చేయడం, మా ప్రచార సన్నాహాలను అడ్డుకుని ఒత్తిడి పెంచడం, ఆఖరి నిమిషంలో మా ప్రచార అనుమతులను రద్దు చేయడం, ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి అనుమతులు, రద్దుల గురించి తప్పుడు మీడియా కథనాలను వ్యాప్తి చేయడం వంటివి చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు.

అవినీతి, దుష్ప్రవర్తనలో హద్దులు లేకుండా వ్యవహరిస్తూ, ప్రజలను మోసగించడానికి అపరిమితమైన తప్పుడు వాగ్దానాలు చేస్తున్న ఈ “పరిమిత కంపెనీ” డీఎంకేను ఈ ఎన్నికల్లో ప్రజలు కట్టడి చేసి ఇంటికి పంపిస్తారన్నారు. ప్రజలు మాపై ప్రేమను, ఆప్యాయతను , నమ్మకాన్ని కురిపిస్తున్నారని అన్నారు. తమిళనాడు చరిత్రలోనే, గత 50 ఏళ్లలో ఇదే మొదటిసారిగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, యువత ఏకమై ఎలాంటి ఆశలు లేకుండా టీవీకేకు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని చెప్పారు టీవీకే పార్టీ చీఫ్‌.

Leave A Reply

Your Email Id will not be published!