భార‌త దేశ ప్రజాస్వామ్యానికి ఇది చీక‌టి రోజు

బీజేపీ చీఫ్ రామ‌చంద‌ర్ రావు ఫైర్

హైద‌రాబాద్ : పార్లెమంట్ లో డీ లిమిటేషన్ బిల్లు వీగి పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది విజయం కాదని, ప్రజాస్వామ్యానికి ఒక నల్ల రోజుగా అభివ‌ర్ణించారు. విప‌క్షాలు ఎవ‌రి వైపు ఉన్నాయో తేలి పోయింద‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఏకి పారేశారు. ఆమెకు అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. ఆమె చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఖండించారు రామ‌చంద‌ర్ రావు. మహిళా పార్లమెంటేరియన్ అయినప్పటికీ, సామాన్య మహిళలు పార్లమెంటులోకి ప్రవేశించకుండా నిరోధించే వైఖరిని ఆమె తీసుకున్నారని ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ తీసుకున్న నిర్ణ‌యం దారుణ‌మ‌న్నారు. అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు బీజేపీ చీఫ్‌. పార్లమెంటులో మహిళలకు అధిక ప్రాతినిధ్యాన్ని అడ్డుకోవడమే ఆమె వైఖరి అని ఆరోపించారు. బిల్లు వీగి పోవ‌డం ప్రజాస్వామ్య విజయమని ఆమె పేర్కొన్నారు, కానీ ఇది ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజుగా చ‌రిత్ర‌లో నిలిచి పోతుంద‌న్నారు రామ‌చంద‌ర్ రావు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై కాంగ్రెస్ నాయకత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వ‌జ‌మెత్తారు. దానికి సంకుచిత, కుటుంబ కేంద్రీకృత దృక్పథం ఉందని ఆయన ఆరోపించారు. సామాన్య మహిళను పార్లమెంటులోకి రాకుండా అడ్డుకున్నందుకు ప్రియాంక గాంధీ ఆనందిస్తూ ఉండవచ్చని నేను భావిస్తున్నాను. ఈ కుటుంబాన్ని గద్దె దించే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని గుర్తు పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు.

Leave A Reply

Your Email Id will not be published!