హైదరాబాద్ : తాము పాలకులం కామని, కేవలం ప్రజా సేవకులం మాత్రమేనని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. గురువారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర మంతటా గ్రామ సభలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రజలకు సందేశం అందించారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయ్యిందన్నారు. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ, సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
పాలకులం అన్న అహంకారంతో ఉండ కూడదని, కేవలం సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమించాలని ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం అని తెలిపారు సీఎం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు మీ ఆమోదం, మద్ధతు ప్రకటించినందుకు ఆనందంగా ఉందన్నారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయన్నారు సీఎం.
ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు. ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం అని ప్రకటించారు. మార్చి 6 నుండి 99 రోజుల పాటు, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతోందన్నారు. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలని అన్నారు. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలన్నారు.
మహాలక్ష్మి – ఉచిత బస్సు సౌకర్యం, ₹ 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలని స్పష్టం చేశారు.
