CM Rekha Gupta: నా రీల్స్‌ చూడటం ఆపండి – కేజ్రీవాల్‌కు ఢిల్లీ సీఎం చురక

నా రీల్స్‌ చూడటం ఆపండి - కేజ్రీవాల్‌కు ఢిల్లీ సీఎం చురక

CM Rekha Gupta : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ పై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (CM Rekha Gupta) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. పంజాబ్‌ లో పాలన, ప్రజలపై దృష్టి పెట్టకుండా తన రీల్స్‌పైనే ఆయన ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోందని అన్నారు. తన రీల్స్‌ చూడటం ఆపి… వరదలతో అతలాకుతలం అయిన పంజాబ్ ను ఎలా అభివృద్ధి చేయాలో చూడాలని చురకలు అంటించారు. సోమవారం నాడు మల్టీ లెవెల్ ఎలక్ట్రిక్ బస్సు డిపో‌ శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

CM Rekha Gupta – అసలు ఏం జరిగిందంటే ?

రేఖా గుప్తా మాట్లాడినట్టు ఉన్న 14 సెకెండ్ల ఒక వీడియోను అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో షేర్ చేశారు. రేఖా గుప్తా మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఒక వీడియోను ఆదివారం అరవింద్ కేజ్రీవాల్‌ షేర్ చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఆమె మాట్లాడుతున్నట్టుగా అందులో ఉంది. ‘‘70 ఏళ్లపాటు కాంగ్రెస్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినంతకాలం అంతా బాగానే ఉంది. ఇప్పుడు మేం చేస్తే మాత్రం వారు బాధపడుతున్నారు. వారు విజయం సాధిస్తే… ప్రజాతీర్పు అంటారు. మేం గెలుపొందితే, ఈవీఎంలు హ్యాక్‌ అయ్యాయని ఆరోపిస్తారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారు’’ అని సీఎం చెప్తున్నట్టుగా ఆ వీడియో ఉంది. ‘సీఎం ఏం మాట్లాడుతున్నారు..?’ అని ఆ క్లిప్‌ను ఎక్స్‌ వేదికగా కేజ్రీవాల్‌ పోస్టు చేశారు.

కేజ్రీవాల్ పోస్ట్‌ను బీజేపీ వెంటనే తప్పుపట్టింది. ఎడిట్ చేసిన వీడియోతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమంటూ మండిపడింది. రేఖా గుప్తా ఇంటర్వ్యూ పూర్తి వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్‌పై సీఎం రేఖా విమర్శలు గుప్పిస్తూ, ప్రజలను రాహుల్ గాంధీ తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ‘వాళ్లు గెలిస్తే అది ప్రజాతీర్పు అంటారు. మేము గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ చేసినట్టు ఆరోపిస్తారు. ఇదెక్కడి ఫార్ములా?’ అని నిలదీశారు.

నా వీడియోలు చూడటం తగ్గించండి సారూ

తాజాగా ఈ అంశంపై రేఖా గుప్తా స్పందించారు. ‘కేజ్రీవాల్ సార్.. దయచేసి నా వీడియోలు, ఇంటర్వ్యూలు, రీల్స్ చూడటం తగ్గించండి. మేడం ఏమి చెప్పిందో, ఏమి చెప్పలేదో తెలుసుకునేందుకు రోజంతా నా వీడియోలు చూస్తున్నట్టు కనిపిస్తోంది’ అని వ్యంగ్యోక్తులు గుప్పించారు. కేజ్రీవాల్ దృష్టి సారించాలనుకుంటే వరదలతో అతలాకుతులమైన పంజాబ్ ప్రజలపై దృష్టి సారించాలన్నారు. పంజాబ్ బాధితులను ఆయన కలిసినట్టు కూడా కనిపించడం లేదని చురకలు వేశారు. కాగా, పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

Also Read : PM Narendra Modi: స్వదేశీ ఉత్పత్తులే కొనాలి, విక్రయించాలి – ప్రధాని మోదీ లేఖ

Leave A Reply

Your Email Id will not be published!