హైదరాబాద్ : సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసే పార్టీ అవసరం ఉందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు ప్రజా సంఘాలు, ఉద్యోగ, కుల సంఘాలు, వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో జాగృతి కార్యకర్తలు, అభిమానులు, వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, కుల సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి కార్మికులు, ఉద్యమకారులు తరలి వచ్చారు.
తెలంగాణ కోసం మీ ఆధ్వర్యంలో రాబోయే పార్టీకి మా మద్దతు ఉంటుందని వారంతా కవితకి భరోసా ఇచ్చారు. సింగరేణి కార్మికులు, హెచ్ఎంఎస్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, బీసీ సంఘం, అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాలు, తొలి, మలి దశ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ, ఉద్యమకారుల జేఏసీ స్టేట్ కమిటీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ, ఆటో యూనియన్ నాయకులు, మహిళా సంఘాలు, కుల సంఘాల నాయకుల బాధ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కవితని కలిసిన వారిలో ఉన్నారు. తాము మీ వెంటే వస్తామని ప్రకటించారు. తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై తాము ప్రస్తావిస్తామని , వారి తరపున పోరాడుతామని ప్రకటించారు కవిత.
