అమరావతి : భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుని నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో 4 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం అందిస్తోన్న సహకారం అంది పుచ్చుకునేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. డిసెంబర్ 2026 నాటికి పెండింగ్ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి దిశా నిర్ధేశం చేశారు బీసీ జనార్దన్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యలను త్వరితగతి పరిష్కరించుకుని, ఆయా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఒక నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ, అటవీ క్లియరెన్స్ వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఫోకస్ పెట్టాలన్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ), కేంద్ర రోడ్లు, రవాణా, హైవే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చించడం జరిగిందన్నారు. 3 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపై సాధించిన పురోగతిని అధికారులు ప్రాజెక్టుల వారీగా మంత్రికి వివరించారు.