అమరావతి : ఏపీ పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారాలని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు అటవీ, పర్యాటక, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఒక కమిటీగా ఏర్పడి సమన్వయంతో పని చేయాలన్నారు. సుమారు 200 ప్రాంతాలను గుర్తించి, అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలన్నారు. దీనిపై ఐదు రోజుల్లోగా ఒక సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వచ్చే పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించడం అత్యంత ముఖ్యం అన్నారు. కొత్త ప్రదేశాలను చూడటానికి రాష్ట్రానికి వచ్చే వారికి, ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలతో పోలిస్తే అత్యుత్తమ స్థాయి భద్రతను కల్పించేలా… కొత్త ‘పర్యాటక పోలీసు’ విధానంపై తాము త్వరలో మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
పర్యాటక శాఖ, అటవీ శాఖతో సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రంలో పర్యావరణ పర్యాటక అభివృద్ధికి మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు పవన్ కళ్యాణ్. పర్యాటకులకు అద్భుతమైన అనుభవం లభిస్తే, వారు మరో పది మందికి ఆ విషయాన్ని తెలియ జేస్తారని అన్నారు. తద్వారా రాష్ట్రం పర్యాటక స్వర్గధామంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటక ప్రదేశాలకే కాకుండా, దేవాలయాలను సందర్శించడానికి వచ్చే భక్తులకు కూడా భద్రత కల్పించాలన్నదే నా ఆకాంక్ష అని స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 50,000 మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పూర్తి భద్రత కలిగిన రాష్ట్రంగా జాతీయ గుర్తింపు పొందుతుందని చెప్పారు. దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకుని, పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రలకు వచ్చేవారికి తగిన భద్రత కల్పించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.