ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు : జ‌న‌సేన‌

పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశాల మేర‌కు నిర్ణ‌యం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఆదేశాల మేర‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది పార్టీ హైక‌మాండ్. ఈ మేర‌కు ఇవాళ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా జ‌నసేన పార్టీ కార్య‌వ‌ర్గాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్న‌ట్లు తెలిపింది. రాష్ట్ర కార్యాల‌యం నుంచే ప‌నులు, కార్య‌క్ర‌మాలు ప‌ర్య‌వేక్షిస్తార‌ని, నిర్ణ‌యాలు కూడా హైక‌మాండ్ నుంచే తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జనసేన పార్టీ నాయకుల మధ్య లోపించిన సఖ్యత, పార్టీ నియమాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న తీరుపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తో సహా, జిల్లా కార్యవర్గ సభ్యులతో కూడిన కమిటీ రద్దు తక్షణం అమలులోకి వస్తుందని పార్టీ ప్ర‌క‌టించింది. క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, పార్టీ నియమాలను దాటిన వారందరి నుంచి వివరణ తీసుకోవాలని కేంద్ర కార్యాలయానికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త కమిటీని నియమించే వరకూ ఉమ్మడి ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం పర్యవేక్షిస్తుందని స్ప‌ష్టం చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో పార్టీ ప‌రంగా ఎవ‌రైనా, ఏ స్థానంలో ఉన్నా, ఎంత‌టి స్తాయిలో , ప‌ద‌వుల్లో ఉన్నా పార్టీ రూల్స్ కు విరుద్దంగా ప్ర‌వ‌ర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. తాజాగా ఆయ‌న తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం క‌ల‌క‌లం రేపుతోంది పార్టీ వ‌ర్గాలలో.

Leave A Reply

Your Email Id will not be published!