పోల‌వ‌రం ప‌నులు ప‌రిశీలించిన‌ బెర్గెర్ బృందం

రెండు రోజుల పాటు నిశితంగా త‌నిఖీ చేసిన టీం

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుడు సీన్ హించి బెర్గెర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ జలవనరుల శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. ఆ తరువాత సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తొలి రోజు డయాఫ్రమ్ వాల్ గ్యాప్ 1, 2 లను పరిశీలించిన ఆయన రెండో రోజు ఎర్త్ కం రాక్ ఫిల్ (ఈ సి ఆర్ ఎఫ్ ) డ్యామ్ నిర్మాణంలో ఉపయోగించే బంకమట్టిపై కేంద్రీకరించారు. సుమారు గంటసేపు ఆయన మట్టి నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ మట్టిని ఎక్కడి నుంచి సేకరించారో అడిగి తెలుసుకున్నారు. వినియోగానికి ముందు నిర్వహించిన పరీక్షల గురించి ఆరా తీశారు. తాము అన్ని పరీక్షలు నిర్వహించిన తరువాతే మట్టిని వినియోగిస్తున్నామని, అంతకు ముందు అంతర్గతంగా కూడా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ఈ సి ఆర్ ఎఫ్ లో బంకమట్టి వినియోగం, జి -జి హిల్ పటిష్ట పరచటానికి నిర్మిస్తున్న గోడ, నిల్వ నీటిని తోడేందుకు నిర్దేశించిన ప్రణాళికపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా బెర్గెర్, కేంద్ర జల సంఘం అధికారులు అడిగిన సందేహాలను రాష్ట్ర జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులు నివృత్తి చేశారు.

కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పోలవరం ప్రాజెక్ట్ లో నిర్వహిస్తున్న పరీక్షలు నేటితో ముగిసాయి. ప్రాజెక్టులో ఈ సి ఆర్ ఎఫ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ నిపుణులు సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే తమ పరీక్షలు కొనసాగించారు. వీరు గ్యాప్ 2 ప్రాంతంలో పరీక్షలు నిర్వహించారు. నీటి ప్రవాహం ఉన్నపుడు రాళ్లు పరిచిన ప్రాంతం తట్టుకోగలదా లేదా అని ప్రధానంగా పరీక్షించారు. మట్టి, ఇసుక వినియోగించిన ప్రాంతాల్లో కూడా ఇదే తరహా పరీక్షలు కొనసాగాయి. సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం నిర్వహించిన పరీక్షల్లో జలవనరుల శాఖ డి ఈ లు డి శ్రీనివాస్, శ్రీకాంత్, విజయ్ కుమార్, ఎం ఈ ఐ ఎల్ పోలవరం ప్రాజెక్ట్ జి ఎం ఏ గంగాధర్, డి జి ఎం లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!