ఎన్టీఆర్ జీవితం స్పర్తి దాయ‌కం : సీఎం

ఈ దేశానికి ముగ్గురు దిశా నిర్దేశం చేశారు

హైద‌రాబాద్ : పేద‌ల‌, బ‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దివంగ‌త సీఎం ఎన్టీఆర్ అని కొనియాడారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అమీర్ పేట్ మైత్రీవనం సర్కిల్ లో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుజాతి అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించు కోవడం సంతోషంగా ఉంద‌న్నారు.

దేశ చరిత్ర నుంచి ఎవరు స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు జాతి రత్నాలను తలచు కోవాల‌న్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి పేదలకు ఓటు హక్కును కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను మొదటగా స్మరించు కోవాలి . భూ సంస్కరణలు తెచ్చి పేదలకు పంచి హక్కులు కల్పించిన ఇందిరా గాందీని స్మ‌రించు కోవాలన్నారు. నీతి, నిజాయితీ, ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు ఎన్టీఆర్ ను త‌లుచు కోవాల‌న్నారు సీఎం. మానవ మనుగడ ఉన్నంత కాలం ఈ ముగ్గురు జాతిరత్నాలను స్మరించు కోవాల్సిందేన‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటని కొందరు మాట్లాడుకుంటున్నారు. విమర్శలు చేస్తున్నారు. కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జాతి గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తి అని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!