యుద్ద ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్దరణ
ఆదేశించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి : రాష్ట్ర విద్యుత్ , గనుల శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటితో పాటు ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఈదురు గాలులు , వర్షాలు రావడంతో పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి సమీక్ష చేపట్టారు. రాత్రి ఈదురుగాలులు, వర్షంతో ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. వర్షం కారణంగా రాత్రి వేళల్లో విద్యుత్ పునరుద్ధరణకు ఆలస్యమవుతోందని మంత్రికి వివరించారు ఉన్నతాధికారులు. ఇదిలా ఉండగా ఇవాళ మధ్యాహ్నం లోగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
ఏ పనికి ఎంత సమయం పడుతుందో పర్యవేక్షించాలని అధికారులకు సూచనలు చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్త సందేశాలు పంపాలని సూచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా 1912 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని కోరారు. విజయవాడలో విద్యుత్ తీగ తెగిపడి హోంగార్డు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంగార్డు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సిబ్బంది అందుబాటులో ఉన్నారని కానీ వర్షం, ఈదురు గాలులతో పనులకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. ఫీడర్లు డౌన్ అయి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
ప్రధానంగా చెట్లు, విద్యుత్ పోల్స్ వద్ద ఎవరూ ఉండరాదని సూచించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. సాధ్యమైనంత మేరకు ఇవాళ విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. విద్యుత్ సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని, వారి సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.