హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది .హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు , తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గ్రామీణ నేపథ్యంలోని రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ సంగీతం అందించారు. దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం అన్నారు. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం అని తెలిపారు.
గాయని సునీత మాట్లాడుతూ ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అతనికి రెండో సినిమా. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారు. మైత్రి సంస్థ ఈ చిత్రానికి అండగా నిలవడం గర్వకారణం అన్నారు. సీనియర్ నటుడు భానుచందర్ మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ఈ చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద విజయంగా మార్చాలన్నారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ ఇది నాకు తొలి సినిమా. మా దర్శకుడికి తొలి చిత్రం. హీరోయిన్ కు తొలి సినిమా. హీరో ఆకాష్‌కు రెండో సినిమా. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందన్నారు.