నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
ఎన్జీ రంగా యూనివర్శిటీ శాస్త్రవేత్తలకు ప్రశంస
అమరావతి : ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన నూతన బీటీ పత్తి రకం ‘లాం బీజీ టూ-2208 (ఆదిత్య బీజీ-2)’ విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి రైతులకు పంపిణీ చేశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంగ్రూ ఉపకులపతి డా. పాలడుగు వెంకట సత్యనారాయణతో కలిసి మంత్రి ఈ విత్తనాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రైతులు ప్రతి సంవత్సరం ప్రైవేట్ కంపెనీల నుంచి అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ విశ్వ విద్యాలయాలు చేపడుతున్న పరిశోధనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు.
పత్తి విత్తనాల్లో కల్తీ సమస్యల వల్ల రైతులు నష్టపోతున్న నేపథ్యంలో, ఆంగ్రూ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ నూతన రకం రైతులకు భరోసానిచ్చేలా ఉందన్నారు. బీటీ సాంకేతికతపై పేటెంట్ హక్కులు ముగిసిన అనంతరం సుమారు తొమ్మిదేళ్ల పాటు శాస్త్రీయ పరిశోధనలు, అఖిల భారత స్థాయి పరీక్షలు నిర్వహించి ఈ రకాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జాతీయ విత్తన విడుదల కమిటీ ఆమోదంతో విడుదలైన ఈ రకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేసిన తొలి బీటీ పత్తి రకం కావడం గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా సాగుకు అనుకూలంగా ఈ రకాన్ని సిఫారసు చేసినట్లు తెలిపారు.
లాం బీజీ టూ-2208 రకం హెక్టారుకు 32 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇచ్చే సామర్థ్యం కలిగి ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హైబ్రిడ్ రకాలతో సమానమైన దిగుబడిని ఇవ్వడంతో పాటు మెరుగైన దూది నాణ్యతను కలిగి ఉందన్నారు.
