న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆక్వాకల్చర్, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించింది. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి , పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను ఆయన నివాసంలో కలిసి అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో నెం.146 ద్వారా అమరావతి సమీపంలో 7.89 ఎకరాల భూమిని కేటాయించిందని, డీపీఆర్ తయారీ, పరిశీలనలు, ఆర్థిక అనుమతులు, నిధుల విడుదల, టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి 2028 నాటికి నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ఈ కేంద్రాల ఏర్పాటుతో NFDB ప్రాంతీయ కార్యాలయం, ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీతో పాటు శిక్షణా కేంద్రం అందుబాటులోకి వచ్చి ఆక్వా రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అనంతరం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో కలిసి ఆక్వా, ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రంగాల సమస్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందని, ఈ రంగంపై లక్షలాది మంది రైతులు, కార్మికులు, హేచరీలు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులు ఆధారపడి ఉన్నారని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ముఖ్యంగా ఫీడ్ ధరలు పెరగడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ఫిష్ మీల్ ఎగుమతులను నియంత్రించి దేశీయ అవసరాలకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రులు, ఎంపీలు కోరారు.
