ముంబై : భారత జట్టుకు విశిష్ట సేవలు అందించిన అరుదైన ఆటగాడు ముంబైకి చెందిన అజింక్యా రహానే ఉన్నట్టుండి ఇవాళ తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో తనతో ఆడిన ఆటగాళ్లు, అభిమానులు పెద్ద ఎత్తున తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. విరాట్ కోహ్లీ అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రహానే ఆటగాడి గానే కాదు మంచి మనసు ఉన్నోడని పేర్కొన్నాడు. తనకు అత్యంత ఇష్టమైన భాగస్వామి తను అని వెల్లడించాడు. మాస్టర్ సచిన్ టెండూల్కర్ అయితే రహానే అద్భుతమైన ఆటగాడు అంటూ ప్రశంసించాడు. 2011-2023 మధ్య కాలంలో భారత్ తరపున మొత్తం 85 టెస్టులు, 90 వన్డేలు , 20 టీ20లు ఆడిన అజింక్య రహానే, తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మూడేళ్ల తర్వాత అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన అజింక్య రహానే గురించి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందుగా స్పందించాడు.
రహానే తన కెరీర్‌లో ఎప్పుడూ కేవలం ‘ప్రత్యేక క్షణాల’ కోసం వెంపర్లాడలేదని ప్రశంసించారు. కోహ్లీ , రహానే భారత్ తరపున టెస్టులు ఆడుతున్నప్పుడు 10 సార్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని ,19 సార్లు 50కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి మధ్య అత్యుత్తమ భాగస్వామ్యం ఇండోర్‌లో న్యూజిలాండ్‌పై నమోదైన 365 పరుగులు ఉన్నాయి. ఇందులో కోహ్లీ 211 పరుగులు చేయగా, రహానే తన కెరీర్-బెస్ట్ స్కోరు 188 పరుగులు సాధించారు. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు మిత్రమా. భారత క్రికెట్ కోసం నువ్వు అద్భుతాలు చేశావు, నీ ప్రయాణం పట్ల నువ్వు ఎంతో గర్వపడవచ్చు. స్లిప్స్‌లో అత్యంత నమ్మదగిన ఫీల్డర్ , నాకు అత్యంత ఇష్టమైన టెస్ట్ బ్యాటింగ్ భాగస్వామివి నువ్వు. నీకు ఎల్లప్పుడూ శుభాకాంక్షలు. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అని కోహ్లీ పేర్కొన్నాడు.
ముంబై తరపున రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు ఒక ప్రతిభావంతుడైన యువకుడితో కలిసి బ్యాటింగ్ చేసిన సందర్భాన్ని టెండూల్కర్ గుర్తు చేసుకున్నారు. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. ముంబై తరపున మనం కలిసి బ్యాటింగ్ చేసిన మొదటిసారి కీర్తి కోసం ఎప్పుడూ వెంపర్లాడని వ్యక్తిని నేను చూశాను. జట్టు కోసం కష్టపడి పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టే ఆ విజయాలు, అవకాశాలు నీ దగ్గరకు వచ్చాయి. ఆ లక్షణమే ఆస్ట్రేలియాలో నీ అత్యుత్తమ ప్రదర్శనకు ( కారణమైంది అని టెండూల్కర్ తన మైక్రో-బ్లాగింగ్ వేదికపై రాశారు.
