తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ “నల్ల బంగారాన్ని” గత సంవత్సరాల కంటే ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా సమర్పించడం విశేషం. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టి, నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. ఈ ఏడాది మే నెలలో 27వ తేది వరకు 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం. కాగా 2024 మే నెలలో మొత్తం 10,65,729 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
ఇటీవల వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రాక భారీగా పెరిగింది. మే 18 నుండి 23 వరకు వరుసగా ఆరు రోజుల పాటు ప్రతిరోజూ 50 వేలకుపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23వ తేదీన ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. భక్తులకు వేచిచూసే సమయం తగ్గించేందుకు, సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5, జీఎన్సీ, హెచ్వీసీ, సప్తగిరి విశ్రాంతి గృహం, నందకం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీవేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతాల్లో మొత్తం 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి.