న్యూఢిల్లీ : ఏపీలో పర్యాటక, సాంస్కృతిక రంగాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటించారు. పలువురు మంత్రులను కలిశారు. ఏపీకి సాయం చేయాలని కోరారు. లలిత కళలను ప్రోత్సహించడంతో పాటు నూతన కళాకారులకు సరైన వేదికను అందించ వచ్చనే ఉద్దేశంతో విశాఖపట్నంలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని, యోగి వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు వంటి మహా మహులైన కవుల వారసత్వాన్ని కొనసాగించేలా సహకరించాలని కోరారు, తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడానికి ఏపీలో సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం, కూచిపూడి నృత్యం, గొప్ప చారిత్రక సాహిత్యం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) బ్రాంచ్ ఏర్పాటు చేయాలని మంత్రి దుర్గేష్ కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.
అందుకు అవసరమైన వసతి సౌకర్యాలను కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తద్వారా రాష్ట్ర కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకోవడానికి అవకాశం లభిస్తుందని వివరించారు.. 16 విశ్వవిద్యాలయాలు, 100 ఇంజనీరింగ్ కళాశాలలు, 12 వైద్య కళాశాలలతో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, విద్యా మార్పిడికి కేంద్రంగా ఉందని రాష్ట్ర వైభవాన్ని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సంగీత, నృత్య ఉత్సవాలు నిర్వహించడానికి తగిన స్థాయి ఆడిటోరియం అందుబాటులో లేదని, ఈ క్రమంలో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు (GVR) సంగీత , నృత్య కళాశాలలో ‘కళాక్షేత్ర’ ఆడిటోరియం నిర్మిస్తే, అది కళాకారులకు , విద్యార్థులకు గొప్ప వేదికగా మారుతుందని కేంద్రానికి విన్నవించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి దుర్గేష్ తెలిపారు.
