అమరావతి : రాష్ట్రంలో శనగ ఉత్పత్తి భారీగా పెరగడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ చూపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కొనుగోలు పరిమితి సరిపోదని గుర్తించిన మంత్రి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి అచ్చెన్నాయుడు సూచనల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా 72 వేల మెట్రిక్ టన్నులు, నాఫెడ్ ద్వారా 12 వేల మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలు చేశారు. మొత్తం 84 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తవడంతో ప్రస్తుతం ఉన్న లక్ష్యం త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది శనగ సాగు విస్తీర్ణం 3,88,413 హెక్టార్లకు పెరిగింది. ఉత్పత్తి కూడా 4,57,365 మెట్రిక్ టన్నులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి 94,500 మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలు లక్ష్యం మాత్రమే ఉన్నప్పటికీ, పెరిగిన ఉత్పత్తి దృష్ట్యా దానిని 4,57,365 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం మార్కెట్లో శనగ ధర కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉండటంతో రైతులు తమ మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు అదనపు కొనుగోళ్లు తప్పనిసరి అని మంత్రి అచ్చెన్నాయుడు భావించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, పెరిగిన ఉత్పత్తికి అనుగుణంగా శనగ కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
