ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో అధికార, ప్రతిపక్ష నియోజకవర్గాల తేడా లేకుండా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఉటంకించారు సీఎం. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం, రూ. 500 లకే సిలిండర్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం అన్నారు. ఎక్కడా పార్టీలను చూడలేదన్నారు. ఆడబిడ్డల కష్టాలను మాత్రమే చూశామని పేర్కొన్నారు.
2034 నాటికి ఆదిలాబాద్ జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక వాడగా, పర్యాటక ప్రాంతంగా, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ సమీప భవిష్యత్తులో జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. ఆదిలాబాద్ జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు చేయక పోవడం వల్ల వెనుకబడిన ప్రాంతంగా మిగిలి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అపారమైన జల వనరులు, అపారమైన ప్రాచీన సంస్కృతి ఉందన్నారు. అయినప్పటికీ వ్యవసాయం విస్తరించ లేదన్నారు. విద్య, వైద్యం అందలేదు. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి నెలకొందన్నారు.
