సింహాచలం చందనోత్స‌వానికి భారీ ఏర్పాట్లు

అప్ప‌న్న స్వామిని ద‌ర్శించుకున్న హోం మంత్రి

విశాఖ‌పట్నం జిల్లా : సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఇవాళ‌ జరిగే అప్పన్న స్వామివారి చందనోత్సవం నేపథ్యంలో సింహగిరిపై ఏర్పాట్లను హోం మంత్రి అనిత పరిశీలించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మౌలిక వసతులు, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏర్పాటు పరిశీలనలో ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, సింహాచలం ఆలయ ఈవో వెంకటరావు, డీసీపీ 2 మేరీ ప్రశాంతి తదితర అధికారులు పాల్గొన్నారు.

సీసీటీవీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో ఏఐ టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. సామాన్య భక్తులకు దర్శనంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి అనిత‌ పేర్కొన్నారు. గత ఏడాది చందనోత్సవానికి సుమారు 1.20 లక్షల మంది భక్తులు హాజరు కాగా, ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల మంది వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నామన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ వంటి ఏర్పాట్లు చేసినట్లు హోం మంత్రి అనిత వెల్లడించారు.

Leave A Reply

Your Email Id will not be published!