హైదరాబాద్ : తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ సంస్థ (ఐఎండీ). సుదీర్ఘకాలం పాటు పొడి వాతావరణం నెలకొన్న తర్వాత రాత్రి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురవడంతో పొడి వాతావరణ పరిస్థితుల నుండి ఉపశమనం లభించింది. ఇదిలా ఉండగా రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి , భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
ఉత్తర, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితులు రాబోయే మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. తాజా అంచనాల ప్రకారం సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షపాతం, తేమ శాతం పెరగడంతో, సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఉష్ణోగ్రతలో మార్పులు మరియు అధిక తేమ కారణంగా వర్షాకాలంలో కీటకాలు, నీరు , గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని ప్రజారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ తెలిపారు.
డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
దోమల తెరలు, దోమలను తరిమికొట్టే సాధనాలను ఉపయోగించాలని, అలాగే తలుపులు , కిటికీలకు జాలీలు అమర్చు కోవాలని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. దోమల వ్యాప్తిని నివారించడానికి తమ ఇళ్ల చుట్టూ నిలిచి ఉన్న నీటిని తొలగించాలని కూడా ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధుల కేసులు పెరిగితే ఎదుర్కోవడానికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆసుపత్రులలో ప్రత్యేక పడకలు, ఐవీ ద్రవాలు , అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు.
