నల్లగొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ జిల్లా : ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి భారీ ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రూ.2 కోట్లతో నల్లగొండ క్లబ్ అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . నల్లగొండ పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు, నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు. నల్లగొండ పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు రూ.125 కోట్లతో చేపట్టిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి నీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని ఆగస్టు 2028 నాటికి పూర్తి చేయడం ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో అవసరమైన నిధులు సమకూర్చుకుని పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, సుమారు రూ.1,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రూ.300 కోట్లతో అండర్ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బొట్టుగూడ పాఠశాల అభివృద్ధికి రూ.12 కోట్లు కేటాయించామని, పాత టౌన్‌లో రూ.10 కోట్లతో లైబ్రరీ నిర్మించడంతో పాటు విద్యార్థులకు కోచింగ్, ఫౌండేషన్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు మంత్రి.
