Raghuram Rajan: అమెరికా హైర్ చట్టం ఆందోళనకరం – ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
అమెరికా హైర్ చట్టం ఆందోళనకరం - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
అమెరికాలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత(హెచ్‌ఐఆర్‌ఈ-హైర్) చట్టం… హెచ్-1బీ వీసా రుసుం లక్ష డాలర్లకు పెంపు కంటే ఆందోళనకరమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పరిణామం మనదేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. హైర్ చట్టం అమల్లోకి వస్తే అన్నిరకాల అవుట్‌సోర్సింగ్ సేవలపైనా సుంకాలు విధించే అవకాశం ఉందన్నారు. ఇది మనదేశానికి చెందిన ఐటీ సేవలు వాటి ఎగుమతులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందన్నారు. ‘‘మన దేశ వస్తువులపై సుంకాల విధింపు కంటే అత్యంత ఆందోళనకరమైన అంశమేంటంటే.. అమెరికా యంత్రాంగం మన ఐటీ సేవలపై సుంకాలు విధించేందుకు మార్గాలను అన్వేషిస్తుందా? లేదా? అన్నదే. ఇదే అతిపెద్ద ముప్పు’’ అని రఘురాం రాజన్ అన్నారు. అవుట్‌సోర్సింగ్ సేవలు లక్ష్యంగా రూపొందించిన హైర్ చట్టంపై అమెరికా కాంగ్రెస్ చర్చిస్తోందన్నారు. హెచ్-1బీ వీసా ఫీజు పెంపు సమస్యపై రఘురాం రాజన్ స్పందిస్తూ.. ఇప్పటికే ఈ వీసాను పొంది ఉన్నవారు, స్టెమ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అభిప్రాయపడ్డారు.
అసలు ఏమిటీ హైర్ చట్టం ?
అమెరికా కంపెనీలు తమ పనిని ఇతర దేశాలకు అవుట్‌సోర్స్ చేయడాన్ని నిరుత్సాహపరిచి దేశంలో ఉద్యోగ సృష్టికి ప్రోత్సాహం అందించాలన్నది హైర్ చట్టం ప్రధాన ఉద్దేశం. అమెరికాలో అందించే సేవల కోసం విధులు నిర్వహించే విదేశాల్లోని ఉద్యోగుల జీతభత్యాల మొత్తాలపై 25 శాతం సుంకం విధించాలనేది చట్టంలో ప్రతిపాదన. ఇది విదేశాల్లో అవుట్‌సోర్సింగ్ ద్వారా ప్రాజెక్టులు నిర్వహించుకునే అమెరికా సంస్థలకు మోయలేని భారంగా మారనుంది. అదేవిధంగా అవుట్‌సోర్సింగ్ చెల్లింపులను పన్ను మినహాయింపు ఖర్చులుగా కూడా చూపించుకునే అవకాశాన్ని కోల్పోతాయి. ఈ సుంకాల ద్వారా సమకూరే మొత్తాన్ని అమెరికాలో నూతన దేశీయ మానవ వనరుల నిధికి జమ చేస్తారు. ఈ నిధులను అమెరికాలోని ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు అవసరమైన శిక్షణ, అప్రెంటీస్‌షిప్ కార్యక్రమాలకు వినియోగిస్తారు. తద్వారా వారికి ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలు దక్కేలా చూస్తారు.
