రేపు త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న

దేశ రాజ‌ధానిలో ప్ర‌ధాని మోదీ, రాహుల్, సోనియాతో భేటీ

చెన్నై : త‌మిళ‌నాడు సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తొలిసారిగా దేశ రాజ‌ధాని ఢిల్లీకి ఈనెల 27న బుధ‌వారం చెన్నై నుంచి బ‌య‌లుదేరి వెళ్ల‌నున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా స‌ర్కార్ వెల్ల‌డించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారిగా పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి విజయ్ సమావేశమై చర్చించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కాంగ్రెస్ అగ్ర నాయ‌కులు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌తో కూడా భేటీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తిరువళ్లువర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. సీఎం బుధ‌వారం ఉద‌యం చెన్నై నుంచి ఢిల్లీకి బ‌య‌లు దేర‌తారు. విజయ్ ఢిల్లీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని హోం సెక్రటరీతో సహా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున బందోబ‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సెక్యూరిటీ దృష్ట్యా విజ‌య్ కు కేంద్ర ప్ర‌భుత్వం జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇటీవ‌లే టీవీకే పార్టీ అత్య‌ధిక సీట్ల‌ను కైవ‌సం చేసుకుని కూట‌మి తో క‌లిపి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. మ‌రో వైపు జోసెఫ్ విజ‌య్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీజేపీపై.

Leave A Reply

Your Email Id will not be published!