న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడాఉన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషితో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు సీఎం. రాష్ట్రంలో యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.
బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి తమ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి జోషి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరవడం జరిగిందని చెప్పారు . పిల్లల్లో రక్తహీనత, పోషక లోపాల నివారణ కోసం పోషకాహార బియ్యాన్ని (FRK) పాఠశాలలు, వసతి గృహాలు, ఐసీడీఎస్‌ల పరిధిలో పంపిణీ చేసే వారని వెల్లడించారు. అయితే ఇటీవల దానిని నిలిపి వేసినందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. వెంటనే పునః ప్రారంభించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరామన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
