విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్రం లోటు రాష్ట్రమని, పెరుగుతున్న సీట్లతో మరింతగా ఉత్తరాది బలం పెరిగితే, కేంద్రం నుంచి వచ్చే నిధులపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని, పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపాదిత డీలిమిటేషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక భవిష్యత్తుకు మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందన్నారు.
మెరుపు వేగంతో, నియంతృత్వ పోకడతో రాజ్యాంగ బద్ధంగా సంప్రదింపులు అనేవి లేకుండా, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకు వస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ, జనాభా ప్రాతిపదికన మాత్రమే అమలు చేయబడితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ బలం, ఆర్థిక అవకాశాలు అత్యంత దారుణంగా అతి తీవ్రంగా దెబ్బతింటాయని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇది కేవలం రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు; ఇది మన రాష్ట్ర ఆర్థిక స్థితి గతి, భవిత, అభివృద్ధి, సంక్షేమ ఆకాంక్షలు, వీటన్నిటినీ అంధకారంలోకి నెట్టివేసే సందర్భం పేర్కొన్నారు.
లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం తగ్గి పోవడం వల్ల కేంద్ర స్థాయిలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యంతో వచ్చే సదవకాశాలు పూర్తిగా నష్టపోయి, మన రాజకీయ శక్తి తీవ్రంగా బలహీన పడుతుందన్నారు షర్మిలా రెడ్డి. కేంద్ర నిధుల కేటాయింపులు, జాతీయ ప్రాజెక్టుల ప్రాధాన్యత, విధాన నిర్ణయాల్లో రాజకీయ బలం, దేశానికి సంబంధించిన కీలక అంశాల్లో మన గళం, ఇలా కీలక పాత్రలు పోషించే విషయాల్లో, వ్యవస్థల్లో బలహీన పడిపోతుందన్నారు. స్పష్టంగా ఆర్థిక నష్టాలకు దారి తీస్తుందన్నారు.
