మహిళలను నాయకురాళ్లుగా తీర్చి దిద్దడమే లక్ష్యం

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్ర‌క‌ట‌న

అమరావతి : మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే కట్టుబడి పని చేస్తోందని, మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా చట్టసభల్లో 33 శాతం టికెట్లు కేటాయించాలని మహానాడు వేదికగా పార్టీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అమరావతిలో పాత్రికేయులతో ఆమె మాట్లాడారు, మహిళలను కేవలం ఓటర్లుగానే కాకుండా సమాజ నిర్మాణంలో కీలక భాగస్వాములు, నిర్ణయాధికారులు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నిరంతరం పని చేస్తోందని తెలిపారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు అత్యున్నత స్థానం ఉన్నప్పటికీ, ఒక దశలో మహిళలను వంటింటికే పరిమితం చేయాలనే సంకుచిత భావజాలం సమాజంలో పెరిగిందని ఆమె పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో మహిళలకు సమాన హక్కులు, గౌరవ ప్రదమైన స్థానం కల్పించేందుకు మహానేత నందమూరి తారక రామారావు చారిత్రాత్మక సంస్కరణలు తీసుకు వచ్చారని గుర్తు చేశారు.

మహిళలకు కుటుంబ ఆస్తుల్లో సమాన హక్కులు కల్పించిన తొలి నాయకుడు ఎన్టీఆరేన‌ని , అనంతరం దేశ వ్యాప్తంగా అదే దిశగా చట్టాలు రావడానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. మహిళా విద్యాభివృద్ధికి ప్రత్యేక మహిళా విశ్వ విద్యాలయాల ఏర్పాటు వంటి నిర్ణయాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే రాజకీయాల్లో కూడా వారికి అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ఎన్టీఆర్ ఎంతో ముందుగానే గుర్తించారని హోంమంత్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వేలాది మంది మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశాలు లభించాయని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!