హైదరాబాద్ : యావత్ భారత దేశం తన వైపు తిప్పుకునేలా చేశాడు తమిళనాడులో అగ్ర నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్. తను పార్టీ స్థాపించిన 2 సంవత్సరాలలోనే తమిళ నాట అధికారంలోకి రావడం రాజకీయ ఉద్దండులను, ఆయా పేరు మోసిన పార్టీ అధినేతలను విస్తు పోయేలా చేసింది. అసలు విజయ్ విజయం వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు అని పెద్ద ఎత్తున శోధించారు. చివరకు తేలింది ఏమిటంటే ప్రశాంత్ కిషోర్ కానే కాదు. తన టీంలో పని చేసి రాటుదేలిన కపిల్ సాహు. ఐ ప్యాక్ లో కొంత కాలం పాటు పని చేశాడు. ఆ తర్వాత స్వంతంగా 12 మందితో ఓ టీంను ఏర్పాటు చేసుకున్నాడు. తన యాక్షన్ ప్లాన్ ను అమలు చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇంకేముంది మొత్తం 234 సీట్లకు గాను టీవీకే పార్టీ ఒంటరిగా 108 సీట్లను కైవసం చేసుకుని తమిళనాట రాజకీయ చరిత్రలో ఓ రికార్డును నమోదు చేసింది. ఇది కేవలం విజయ్ కి మాత్రమే సాధ్యమైంది.
తనతో పాటు ఎందరో నటులు పవర్ లోకి రావాలని చూశారు. కానీ సక్సెస్ కాలేక పోయారు. అవినీతి రహిత పాలన అందిస్తానని ప్రకటించాడు. ఆ దిశగా సీఎంగా కొలువు తీరిన వెంటనే అమలు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు తమిళనాడు పాలనా నమూనా దేశానికి ఓ రోల్ మోడల్ గా మారుతోంది. అలా చేయడం వెనుక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు ఉన్నాడనేది జగమెరిగిన సత్యం. ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా డిజైన్ చేశాడు. ఆ తర్వాత ఎవరూ ఊహించని రీతిలో దిమ్మ తిరిగేలా డీఎంకే, అన్నాడీఎంకే , ఇతర పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ ఒక్క విజయంతో ఒక్కసారిగా అందరి కళ్లు ఇప్పుడు ఎవరీ కపిల్ సాహు అని వెదుకుతున్నాయి. డబ్బులు ఖర్చు చేస్తేనే , కోట్లు కురిపిస్తేనే, అబద్దాలు, మోస పూరిత హామీలు ఇస్తేనే ఓట్లు పడతాయని, గెలుస్తామనే భ్రమలో ఉన్న రాజకీయ నాయకులకు చెంప ఛెళ్లుమనిపించేలా చేశాడు కపిల్ సాహు.
ఇక తన విషయానికి వస్తే రాజకీయ విశ్లేషణ, డేటా సేకరణ, వ్యూహాలు పన్నడంలో పీకేకు మించిన పరిణతి సాధించాడు. ఎన్నికల ప్రణాళిక, ప్రచార కథన రూపకల్పన, ఆచరణాత్మక సలహాలు , క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాల ప్రజలను సమీకరించడం, సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టడం దాకా తన 12 ఏళ్ల అనుభవం పనికి వచ్చేలా చేసింది. దీంతో టీవీకే విజయ్ ద్రవిడ ద్వంద్వ ఆధిపత్యానికి చెక్ పెట్టాడు. పాత రాజకీయాలకు ముగింపు పలికేలా చేశాడు. ఇక సాహు జాతీయ స్థాయిలో ఆప్ , కాంగ్రెస్ తో పాటు సిక్కింలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కోసం పని చేశాడు. ఢిల్లీలో రాఘవ్ చద్దా కోసం పని చేశాడు సాహు. యూపీలో ఆప్ విస్తరించేందుకు కూడా దోహద పడ్డాడు. కర్ణాటకలో మాజీ డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ కోసం కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ గా కూడా పని చేశాడు. ఇదే సమయంలో తమిళనాడులో విజయ్ దూసుకు పోయేందుకు మూడింటిపై ఫోకస్ పెట్టాడు. యూత్ ను సమీకరించడం, డిజిటల్ పరంగా చొచ్చుకు పోవడం, నియోజకవర్గాలలో పట్టు పెంచుకునేలా చేయడం. ఈ మూడే టీవీకే గెలుపొందడంలో ఆయుధాలుగా పని చేశాయి. మొత్తంగా కపిల్ సాహు పొలిటికల్ స్ట్రాటిజిస్టులకు కొత్త పాఠం నేర్పాడు. రాజకీయాల్లో రాణించాలంటే కాసులు , కోట్లు అక్కర్లేదని బలమైన స్ట్రాటజీ, సామాన్యులైనా సరే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతారని నిరూపించే ప్రయత్నం చేశాడు. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అన్న అంబేద్కర్ మాటలను నిజం చేశాడు.
