భీమవరం : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, పొరుగు రాష్ట్రానికి చెందిన కొందరు చేస్తున్న హెచ్చరికలకు ఇక్కడ ఎవరూ భయపడే ప్రసక్తే లేదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై విలేకరులు ఆయన దృష్టికి తీసుకు రావడంతో దానిపై స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో NDA కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని, ఈ ప్రగతిని చూసి ఓర్వలేకే కొందరు కుట్రదారులు కంటగింపుతో వ్యవహరిస్తున్నారని మాధవ్ మండిపడ్డారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల నేతృత్వంలోని కూటమికి నష్టం కలిగించాలనే పక్కా ప్రణాళికతోనే ఈ నీచ రాజకీయాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. ఎలాగైనా సరే ఏపీలో అత్యంత పటిష్టంగా ఉన్న కూటమిని విడగొట్టాలనే దురాలోచనతోనే తెలంగాణ వేదికగా ఈ కుట్రలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చని.. అలాంటప్పుడు పర్యటనలను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేయడం తగదన్నారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తి చిత్రపటాన్ని అవమానించడం అత్యంత హేయమైన చర్య అని పి.వి.ఎన్. మాధవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే సమసి పోయిన ఒక వివాదాన్ని మళ్లీ కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి దిగజారుడు సంస్కృతి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అక్కడి నేతలు కూడా ఈ తరహా పరిణామాలపై పునరాలోచించు కోవాలని, లేనిపక్షంలో ఇవి వారికే తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు.
