YS Sharmila: ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది పచ్చి నిజం – వైఎస్ షర్మిల
ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది పచ్చి నిజం - వైఎస్ షర్మిల
YS Sharmila : కేసీఆర్ హాయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పచ్చి నిజమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) అన్నారు. తన ఫోన్ తో పాటు భర్త, దగ్గర వాళ్ల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ… తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. అందుకే తెలంగాణాలో పార్టీ పెట్టిన నన్ను అణగదొక్కడానికి అనేక ప్రయత్నాలు చేసారు. ఈ నేపథ్యంలోలో గత తెలంగాణా ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ (Phone Tapping) చేసి… కాల్ డేటా సమాచారం అంతా జగన్ కు అప్పగించేది. గతంలో ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తా. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలి. ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి వేసిన స్కెచ్.
YS Sharmila – కేసీఆర్ కోసం జగన్ నన్ను తొక్కి పెట్టాలని చూశారు
ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిస్తే మీరు ఏం చేశారు అని నన్ను అడగొచ్చు. ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది. నేను జగన్కు తోడబుట్టిన చెల్లెల్ని. ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర చేశారు. నా భవిష్యత్తును పాతిపెట్టాలని ఎన్నో చేశారు. నాకు మద్దతు పలికిన వాళ్లను బెదిరించారు. రాజకీయంగా నా వాళ్లు రానివ్వకుండా చేశారు. నేను తెలంగాణలో పార్టీ పెట్టడంలో జగన్కు ఏ సంబంధం లేదు. కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశారు. నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారు. నా ప్రతి పోరాటానికి అడ్డుపడ్డారు.’’ అని షర్మిల అన్నారు.
Also Read : PM Narendra Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ
