తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. చంద్ర గ్రహణం కారణంగా వచ్చే మార్చి నెల 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసి వేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఇందులో భాగంగా ఆరోజు మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుందని తెలిపారు. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసి వేయడం ఆనవాయితీగా వస్తోందని వెల్లడించారు ఈవో..
రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్య హవచనం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా చంద్ర గ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేయడం జరిగిందన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించు కోవాల్సిందిగా కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నూతన టెక్నాలజీ సాయంతో వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పించడం జరిగిందన్నారు.
