అనకాపల్లి : అనకాపల్లి నియోజవర్గంలోని పాయకరావుపేటలో భారీ ఉక్కు పరిశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆర్సెలార్ మిట్టల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మాట్లాడారు. ఏపీలో ఓ భారీ స్థాయి స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ అంకురార్పణ చేశాం అన్నారు. ఈ ఏడాది తర్వాత 20 వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న ఆర్సెలార్ మిట్టల్ సంస్థకు ఈ ప్లాంట్ ఓ కలికి తురాయి అవుతుందన్నారు. నేను జన్మించిన నా భారత దేశంలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నందుకు గర్వకారణంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ కార్యక్రమంలో ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు లక్ష్మీ నివాస్ మిట్టల్.
మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పరిశ్రమలు, రక్షణ రంగ ఉత్పత్తులు ఇలా వేర్వేరు రంగాలకు అవసరమైన స్టీల్ ఉత్పత్తులు తయారవుతాయని చెప్పారు. ఏడాదికి 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో దేశ అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నాం అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజన్ కు అనుగుణంగా పారిశ్రామిక ప్రగతికి ఈ ప్లాంట్ తోడ్పడుతుందని ఆశిస్తు్న్నానని పేర్కొన్నారు . పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం నింపేలా ఏపీలోని విధానాలు ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రగతి సాధించేందుకు తీసుకున్న నిర్ణయాలు దోహద పడతాయని చెప్పారు. భవిష్యత్తులో దేశంలోని పలు ప్రాంతాలలో మరికొన్ని కంపెనీలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు లక్ష్మీ నివాస్ మిట్టల్.
